పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్ ఆసాంతం విజయపరంపర సాగించిన ‘యువ’భారత్ జట్టు ఫైనల్లో చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి ‘కప్పు’ను ముద్దాడింది. అయితే, తమ జట్టు విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాల్లు, సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది.
విజయానందంలో ఉన్న బంగ్లా ఆటగాళ్లలో ఒకరు టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడాడు. అసలే ఓటమితో కుంగిపోయిన మన ఆటగాళ్లకు బంగ్లా ఆటగాళ్ల చేష్టలు కోపం తెప్పించాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు తోసుకునే దాకా మ్యాటర్ వెళ్లింది. వెంటనే స్పందించిన ఫీల్డ్ అంపైర్లు ఇరువురికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ ట్విటర్‌లో పోస్టు చేశాడు.